ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి
నరసాపురం, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థ ల ఎన్నికల పేరుతో కూటమి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా, నామినేషన్ పత్రాలను చింపేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలలో వైసిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వెళ్లిన వారిని అడ్డగించి తీవ్రంగా గాయపరిచారని ఆయన అన్నారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ అవకాశం వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి ప్రజల తీర్పు పొందాలన్నదే వైసీపీ ఆలోచనని ఆయన చెప్పారు. గెలిచిన ఓడిన ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసి ప్రజల తీర్పు కోసం ప్రజల దగ్గరకు వైసిపి నాయకులు కార్యకర్తలు వెళ్తున్నారని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్ర ప్రజలంతా చూశారని, ఈ రెండున్నర ఏళ్లలో కూటమిపాలన చూస్తున్నారని, ఏ పరిపాలన బాగుందో మీరే తేల్చుకుని ఓట్లు వేయండి అని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల ముందు అన్ని తగ్గిస్తామని చెప్పిన కూటమి నాయకులు ఎన్నికల అనంతరం సామాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితిలో నిత్యావసర ధరలు పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అభ్యర్థులు పోటీ చేస్తారని వైసీపీ కూటమి ప్రభుత్వాల మధ్య తారతమ్యాన్ని గమనించి ఓట్లు వేయాలన్నారు. నరసాపురం మున్సిపాలిటీలో పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరా రు. గత వైసిపి పాలనలో మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధిని చూసి మా అభ్యర్థులను గెలిపించమని ఆయన కోరారు. వైసీపీ పాలనలో అర్హులందరికీ పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందజేశామని, ఎన్నికల షెడ్యూల్ రాకముందు హడావిడిగా అందరికీ పెన్షన్లు రాసి వాటిని పక్కన పెట్టేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే వైసీపీ అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా గెలిపించాలని ప్రసాద్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కావలి రామ సీత, షేక్ బులిమస్తాన్,బోసారపు జయప్రకాష్, జిల్లెల్ల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.