ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం
సిద్దిపేట,: బహుజన వర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులను గుర్తించి, వాటిని ఎదుర్కోవాలంటే జ్ఞానాన్ని అందించే విద్య ఎంతో అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్నారు. బహుజన వర్గాలు విద్యావంతులై చైతన్యవంతం కావాలనే సందేశాన్ని పండుగ సాయన్న తన జీవితం ద్వారా అందించారని పేర్కొన్నారు.గురువారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగరాజమ్మ మాట్లాడుతూ.. నిజాం పాలనాకాలంలో జరిగిన తిరుగుబాట్లు, ప్రజా ఉద్యమాలు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ఆ సమాంతర చరిత్రలో పండుగ సాయన్న పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ప్రజల్లో చైతన్యం నింపారని, బహుజనులు తమ హక్కులను గుర్తించి, వాటిని సాధించుకునేందుకు విద్యను ఆయుధంగా మలుచుకోవాలనే సందేశాన్ని ఇచ్చారని వివరించారు.సమాజంలో సమానత్వం సాధించాలంటే విద్య, జ్ఞానం, సామాజిక చైతన్యం కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. పండుగ సాయన్న ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో బహుజన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ సయ్యద్ రఫిక్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏవో రాజ్‌కుమార్‌తో పాటు ముదిరాజ్ ప్రముఖులు జంగిటి కనకరాజు, యమధర్మ, తోట్ల పరశురాములు, గాడ్చర్ల సతీష్, రామకృష్ణ, తుపాకుల బాలరంగం, చింతమడక రాజన్న శ్రీహరి, గుర్రాల శ్రీహరి, సత్యనారాయణ, కొంతం శ్రవణ్, గాడ్చర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.