ముగిసిన బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ సార్వజనిన్ దుర్గాపూజ వేడుకలు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 22: బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ (బీసీఏ) హైదరాబాద్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు బంజారా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 53వ సార్వజనిన్ దుర్గాపూజ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆరు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన బెంగాలీ సమాజ సభ్యులు, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యత, సామాజిక సమైక్యతకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.
ఈ సందర్భంగా బీసీఏ అధ్యక్షుడు సంజయ్ పాన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దుర్గాపూజ వేడుకల్లో భక్తి, సంప్రదాయం, సంస్కృతి, సామాజిక ఐక్యతగా నిలిచాయని తెలిపారు. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ బెంగాలీ వంటకాలు, పండుగ సందడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. బీసీఏ కార్యవర్గ సభ్యుడు బిప్లబ్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ.. సందర్శకులందరికీ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా నవీన్ మిట్టల్
తెలంగాణ ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని వివరించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ, ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువస్తున్న బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ సేవలను ఆయన అభినందించారు. సంస్థ సహాయ ప్రధాన కార్యదర్శి, పీఆర్ –మీడియా సమన్వయకర్త డాక్టర్ త్రిషీతా ముఖర్జీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల ద్వారా సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకుని ఈ ఏడాది పలువురు కొత్తవారు వేడుకల్లో పాల్గొన్నారని, సంస్థతో అనుబంధం ఏర్పరచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.