నీట్లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ
జాతీయ స్థాయిలో 7,000వ ర్యాంకు సాధించిన షేక్ షాహిన్
పామూరు, మేజర్ న్యూస్ :
జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్)లో పామూరు పట్టణానికి చెందిన షేక్ షాహిన్ విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో 7,000వ ఆల్ ఇండియా ర్యాంకును కైవసం చేసుకుంది. పామూరు మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖాదర్ మొహిద్దిన్ సోదరుడు షేక్ మునీర్ భాషా, హాబీబ్ దంపతుల కుమార్తె అయిన షాహిన్ పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించడం పట్టణానికి గర్వకారణంగా నిలిచింది.నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా హైదరాబాద్లోని ప్రముఖ భాటియా మెడికల్ కోచింగ్ సంస్థ వారు షేక్ షాహిన్ను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. సంస్థ ప్రతినిధులు ఆమెకు మెమొంటో బహూకరించి అభినందనలు తెలిపారు. భావి వైద్యురాలిగా సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తూ వైద్య రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.జాతీయ స్థాయిలో సత్తా చాటిన షాహిన్కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె సాధించిన విజయంతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. షాహిన్ తాతయ్య షేక్ మహబూబ్ పీరా, అమ్మమ్మ జహేరా, పెదమ్మ గులాబ్, మేనమామలు, మేనత్తలు, సోదరీసోదరులు ఆమెకు మిఠాయిలు తినిపించి ఆశీస్సులు అందజేశారు. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదివి ఆశించిన ఫలితం సాధించిన షాహిన్ను స్థానిక ప్రముఖులు, పట్టణ ప్రజలు అభినందించారు.