నేడు ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు రాక..
విజయవాడ:ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 గంటలకు సీఎం చంద్రబాబు కొండ మీదకు చేరుకుని, ప్రభుత్వ తరుఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మూలానక్షత్రం పర్వదినం కావడంతో ఇంద్రకీలాద్రికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేడు అన్ని క్యూలైన్లను పూర్తిగా ఉచిత దర్శన క్యూలైన్లుగా మార్చారు. సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని రకాల ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలతో పాటు అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.