ఇంద్రకీలాద్రిపై వైభవంగా మూలానక్షత్ర వేడుకలు.. పోటెత్తిన భక్తులు
విజయవాడ:దుర్గగుడి ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ పవిత్ర దినాన అమ్మవారు సాక్షాత్ విద్యానిలయమైన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిస్తూ విశేష పూజలందుకుంటున్నారు.
మూలానక్షత్ర విశిష్టత కారణంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనాలు ప్రారంభం కాగా, వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు కొండపై ఉన్న గర్భాలయం వరకు బారులు తీరాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సరస్వతీ దేవిని దర్శించుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ చేపట్టారు.