హుస్నాబాద్కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ జీవో జారీ
సూర్య కరీంనగర్ ప్రతినిధి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కృషితో నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ అకాడమీ ద్వారా 40 మంది క్రీడాకారులకు వసతితో కూడిన కబడ్డీ శిక్షణ అందించనున్నారు. ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పించనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కబడ్డీ కోచ్లు, వార్డెన్లతో పాటు గ్రౌండ్స్మెన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం ఎనిమిది సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతించగా, వీటిని ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ గుర్తింపు పొందారు. నూతన అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి ప్రతిభావంతులను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణ అందించి ఉన్నత స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలగనుంది. బాలబాలికలకు సమాన అవకాశాలు లభించడంతో క్రీడల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరగనుంది. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ అకాడమీ కీలకంగా నిలుస్తుందని నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జీవో వివరాలు: G.O.Rt.No.1660, ఆర్థిక శాఖ (HRM.VII), తేదీ: 15-10-2026.