నా ఓటమికి కారణం మాజీ ఎంపీ బోస్,పిల్లి సూర్య ప్రకాష్
నమ్మించి నట్టేట ముంచారు కోటి రూపాయలు ఖర్చు పెట్టించి మొహం చాటేశారు
పిల్లి బోస్, పిల్లి సూర్యప్రకాష్‌పై వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు
రామచంద్రపురం, మేజర్ న్యూస్ :రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి బోస్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్‌ల వైఖరే కారణమని ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతపల్లి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి, కొడుకులుగా ఉన్న పిల్లి బోస్, పిల్లి సూర్యప్రకాష్‌లను నమ్మి తాను తీవ్రంగా నష్టపోయానని, వారి వ్యవహారశైలి వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కన్నీటిపర్యంతమవుతూ మాట్లాడుతూ మాజీ ఎంపీ పిల్లి బోస్ అభ్యర్థన మేరకే తాను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. ఎన్నికల ఖర్చుల కోసం తనకున్న స్థలాన్ని రూ.50 లక్షలకు విక్రయించానని, తన భార్య బంగారాన్ని రూ.30 లక్షలకు బ్యాంకులో తాకట్టు పెట్టానని వెల్లడించారు. అంతేకాకుండా పిల్లి బోస్‌కు రూ.50 లక్షలు ఇచ్చానని ఆరోపించారు.
ఎన్నికల్లో వ్యక్తిగతంగా మరో రూ.50 లక్షలు ఖర్చు చేశానని, మొత్తంగా సుమారు కోటి రూపాయలకు పైగా తనతో ఖర్చు చేయించారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఇంత భారీగా ఖర్చు పెట్టించినప్పటికీ పిల్లి బోస్, పిల్లి సూర్యప్రకాష్‌లు తన ఎన్నికల ప్రచారానికి కనీసం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి, కొడుకులపై నమ్మకంతో ఎన్నికల బరిలోకి దిగితే చివరకు తనను నట్టేట ముంచారని నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి వైఖరి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని ఆరోపించారు. రాజకీయంగా నమ్ముకున్న వ్యక్తికి అండగా నిలవాల్సిన సమయంలో ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తనకు ఎదురైన అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలని సూచించారు. పిల్లి బోస్, పిల్లి సూర్యప్రకాష్‌లను నమ్ముకుని తనలాగా ఎవరూ మోసపోవద్దని వైసీపీ అభ్యర్థులకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. చింతపల్లి నాగేశ్వరరావు చేసిన ఈ సంచలన ఆరోపణలు రామచంద్రపురం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థే పార్టీ ముఖ్య నేతలపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.