andhrapradesh
మురసు తుఫాన్ ప్రభావం తీవ్ర నష్టం
గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలన
రైతులకు వ్యవసాయశాఖ అధికారుల కీలక సూచనలు
గుంటూరు న్యూస్:మురసు తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న వివిధ పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, లాం ఫామ్ శాస్త్రవేత్తలు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల పరిధిలోని అబ్బీనేణి గుంటపాలెం, వరగాని, అన్నపర్రు, కొర్నేపాడు, కర్నూతల గ్రామాల్లో పర్యటించి పంటల నష్టాన్ని అంచనా వేశారు. ఈ తుఫాన్ కారణంగా పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిరప, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.ఈ పర్యటనలో గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన రావు, లాం ఫామ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (కాటన్) డా. ఎన్. చాముండేశ్వరి, ఎంటమాలజీ శాస్త్రవేత్త డా. ఎల్. రాజేష్ చౌదరి, అగ్రానమీ శాస్త్రవేత్త డా. సిహెచ్. నాగ జ్యోతి, జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మణ రావు, ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నీటి నిల్వ తొలగింపు: పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే కాలువల ద్వారా బయటకు పంపించాలి. గాలులకు మొక్కలు వంగినట్లయితే వేర్ల చుట్టూ మట్టిని ఎగతోయాలి. అధిక తేమ వల్ల వచ్చే వేరు కుళ్ళు, కాండం కుళ్ళును గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. కాయ కుళ్ళు తగ్గించడానికి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ + 0.1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల క్రింది భాగపు కొమ్మలు, పచ్చటికాయలు తడిసేలా పిచికారీ చేయాలి. వడబడిన మొక్కల మొదళ్లలో లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణాన్ని పోయాలి. నేల ద్వారా పోషకాలు అందలేని దశలో 13:0:45 లేదా మల్టీ-కె 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మిరప పంటలో సమగ్ర సాగు యాజమాన్యం...
పొలంలో అధికంగా నిలిచిన నీటిని వెంటనే బయటకు తొలగించాలి. వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు చుట్టూ మట్టిని ఎగదోయాలి. మొక్కలు ఉరకెత్తి తలలు వాల్చినట్లయితే త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా చొప్పున కలిపిన ద్రావణాన్ని వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వడలిన మొక్కల నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.