మున్సిపల్ ఎన్నికలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు, మేజర్ న్యూస్ : 01.11.26 న జరగనున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 315 కెవిఏ సామర్ధ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించి, విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 509 పోలింగ్ కేంద్రాలను విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా సందర్శించి పరిశీలించారని, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం లోని 46 పోలింగ్ బూత్ లు ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలోని 16 పోలింగ్ కేంద్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి, ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. నెల్లూరు మున్సిపాలిటీ, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు ప్రాంతాల అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టౌన్) ఎం. శ్రీధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.