మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
పార్వతీపురం, సూర్య : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూకౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలి.చెల్లుబాటయ్యే, చెల్లుబాటు కాని ఓట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి కల్పించాలి.కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా లెక్కింపు సాగేలా సిబ్బందిని సిద్ధం చేయాలని,కౌంటింగ్ హాలుకు బయటే ఆహారం, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు .కౌంటింగ్ కేంద్రాల్లో రౌండ్లు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను క్రమబద్ధంగా వేరు చేసి లెక్కింపునకు సిద్ధం చేయాలని,కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరాదన్నారు.భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫలితాల ప్రకటనకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.