మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి కార్పొరేటర్ టికెట్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించడమే తమ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 12 వ డివిజన్లో పార్టీ కోసం పనిచేసి ఇటీవల మృతి చెందిన గౌస్ బాషా కుటుంబానికి కార్పొరేటర్ టికెట్ కేటాయించినట్లు వెల్లడించారు. శనివారం ఉదయం చిత్తూరులోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. కొన్ని డివిజన్లలో ఆశించిన అవకాశం లభించని నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
మౌళి నిర్ణయంపై ఎమ్మెల్యే ప్రశంసలు
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12 వ డివిజన్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసి మృతి చెందిన గౌస్ బాషా సతీమణి షాహిది గౌస్ బాషాకు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఓసి జనరల్ కు కేటాయించిన ఈ డివిజన్ ఇన్చార్జి మౌళి తాను పోటీ నుంచి తప్పుకొని, షాహిదిగౌస్ బాషాకు టికెట్ కేటాయించాలని స్వచ్ఛందంగా తప్పుకోవడం అభినందనీయమన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనకు ఈ నిర్ణయం సాహేతక మైందని అభివర్ణించారు. 12 వ డివిజన్ ప్రజలు షాహిది గౌస్ బాషాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి పార్టీలకు చెందిన కొంతమంది అనివార్య కారణాల వలన ఇతర పార్టీల వైపు చూడడం, వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ లను పెట్టి కూటమి పార్టీలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసేవారిని, మౌళి లాగా త్యాగం చేసే వారి సొంత మనిషిగా తాను నిలబడతానని స్పష్టం చేశారు. అదే క్రమంలో ఆయా వర్గాల అభివృద్ధి కోసం తాను ఎంతదాకైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. గౌస్ బాషా సతీమణిని ఇటీవల టిడిపిలో చేరిన 12 డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలు అందరూ ముందుండి గెలిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దివంగత గౌస్ బాషా సతీమణికి ఎమ్మెల్యే నామినేషన్ పత్రంతో పాటు, పార్టీ బీ - ఫారాన్ని సైతం అందజేశారు. కాగా ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, చిత్తూరు నగర మహిళా అధ్యక్షురాలు లీలావతి, మైనారిటీ నాయకులు ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ చాంద్ బాషా, అక్తర్ భాష, అన్సర్ భాష, మాజీ కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్