ఎన్నికల పోలింగ్ విధుల నుండి గర్భిణీ, బాలింత ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి!
ఐదేళ్ల లోపు సర్వీస్ వున్నా వారినీ మినహాయించాలన్న ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు
ఎస్.రాయవరం, అక్టోబర్ 17, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధుల నుండి పదవీ విరమణకు ముందు ఐదేళ్ల సర్వీస్ వున్నా సీనియర్లకు, గర్భిణీ.. బాలింత మహిళా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ (పీ.ఆర్.టీ.యూ) యూనియన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. ఇదే విషయమై ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీతా ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు పీ.ఆర్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం.గిరి ప్రసాద్ విడుదల చేసిన ప్రకటనను ఉపాధ్యాయ సంఘం పీ.ఆర్.టీ.యూ స్థానిక నాయకులు శనివారం పత్రికల వారికి అందజేశారు.వినతిపత్రంలో పేర్కొన్న అంశాలు:రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే మానవతా దృక్పథంతో కొన్ని వర్గాలకు మినహాయింపు అవసరమని తెలిపారు.అరవై ఏళ్ళు దాటిన ఉపాధ్యాయుల కోసం…ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు చాలా మంది బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, ఇతర వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, సుదీర్ఘ ప్రయాణాలు, రాత్రివేళల్లో పోలింగ్ కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు గర్భిణీ, బాలింత ఉపాధ్యాయులకు…అదేవిధంగా, గర్భిణీ మరియు చిన్న పిల్లలున్న బాలింత మహిళా ఉపాధ్యాయులకు సుదీర్ఘ ప్రయాణాలు, గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవడం వల్ల తీవ్రమైన శారీరక అసౌకర్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను సానుభూతితో పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధుల నుండి 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు మరియు గర్భిణీ... బాలింత మహిళా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇస్తూ స్పష్టమైన ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ చేయాలని పీ.ఆర్.టీ.యూ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల కమిషనర్ ను కోరింది.