మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ
తణుకు, సూర్య న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో, తణుకు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సోమవారం మండపాక గ్రామంలో ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, చట్ట ఉల్లంఘనల వల్ల ఎదురయ్యే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల పేరుతో అనవసర వివాదాలకు దిగడం, పరస్పర ఘర్షణలకు పాల్పడటం ద్వారా క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని సూచించారు. రాజకీయ అభిప్రాయభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారకుండా సంయమనం పాటించాలన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించే వారిపై రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, వాటి కోసం గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని పోలీసులు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు ముగిసినా గ్రామాల్లో ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అవగాహన కార్యక్రమంలో పోలీసులు స్పష్టం చేశారు.
రిపోర్టర్, అనుకుమార్, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా.