మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టర్ నివాళులు
మచిలీపట్నం, అక్టోబర్ 2, మేజర్ న్యూస్, ప్రతినిధి : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) హాల్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి గాంధీజీ, శాస్త్రిజీలు అందించిన సేవలను స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను పాటిస్తూ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారని కలెక్టర్ పేర్కొన్నారు.
గాంధీజీ ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం దేశ రక్షణ, వ్యవసాయ రంగాల ప్రాధాన్యతను చాటిచెప్పిందన్నారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు, సిబ్బంది గాంధీజీ సత్యం, అహింస, సేవా భావనతో పాటు శాస్త్రిజీ నిరాడంబరత, క్రమశిక్షణ, అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి. నీలకంఠేశ్వరరెడ్డి, కలెక్టరేట్ ఏవో రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్ పాల్, డిప్యూటీ తహసీల్దార్ సుభాష్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
(ప్రేమ్ రాజ్✍️) :