మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 69 వేట ఉచ్చులు తొలగింపు
మారేడుపల్లి, మేజర్‌న్యూస్ :
అటవీ సంపదను, వన్యప్రాణులను పరిరక్షించడంలో నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు. బుధవారం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పును నివారించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రశంసించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని పేర్కొన్నారు. అక్రమ వేట నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. బ్రేక్ వైర్లతో ఉచ్చుల తయారీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడవుల్లో అమర్చే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ముప్పుగా మారుతుందని, వాటిని గుర్తించి తొలగించడం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణకు కీలకమైన సేవ చేసినట్లవుతుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ వంటి చర్యలను మరింత పటిష్టం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు.