క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం
పెరవలి మేజర్ న్యూస్ :రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో నవంబర్ 2 వ తేదీ సోమవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ విషయాన్ని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ యన్నమని రామచంద్రరావు, డాక్టర్ కాదా నాగేంద్ర ప్రసాదరావు, డాక్టర్ సత్యం రమేష్ బాబు వైద్య సేవలు అందించారు. సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. వీరిలో 84 మందికి రక్త పరీక్షలు, ఆరుగురికి థైరాయిడ్ పరీక్షలు, నలుగురికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ యన్నమని రామచంద్రరావు మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ముందస్తు లక్షణాలను గుర్తించడం, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వైద్య బృందం సుమారు 28 మందికి కంటి పరీక్షలు నిర్వహించింది. వారిలో ముగ్గురిని కాటరాక్ట్ (శుక్లం) శస్త్రచికిత్స నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో పది మందికి కళ్లజోళ్లు అందించేందుకు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు కస్తూరిబా గాంధీ ఆశ్రమం ఆధ్వర్యంలో పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి కుమారి జి. సుశీల, యన్నమని వెంకటనారాయణ, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.