కృష్ణా జిల్లాలో మూడు పట్టణ స్థానిక సంస్థలకు నేడు పోలింగ్
మచిలీపట్నం మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లాలో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు పురపాలక సంఘాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ తెలిపారు. ఈ మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 1,97,412 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఎన్నికల నిర్వహణకు 241 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 241 మంది ప్రిసైడింగ్ అధికారులు, 723 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 1,39,246 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 66,504 మంది పురుషులు, 72,732 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేయర్ పదవికి ఐదుగురు, 60 డివిజన్ల కార్పొరేటర్ స్థానాలకు 142 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తంగా 147 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పెడన పురపాలక సంఘం పరిధిలో 25,373 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 12,212 మంది పురుషులు, 13,161 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చైర్పర్సన్ పదవికి ముగ్గురు, 28 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉయ్యూరు పురపాలక సంఘం పరిధిలో 32,793 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 15,768 మంది పురుషులు, 17,024 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చైర్పర్సన్ పదవికి ఆరుగురు, 32 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 86 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 92 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.