కూటమి తరపున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 'పాలూరి' -- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కూటమి తరఫున జనసేన నుంచి పాలూరి వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారైంది. ఆశావహులతో శుక్రవారం ఉదయం నుంచి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుదీర్ఘ చర్చల అనంతరం పాలూరి వెంకటేశ్వర్లు పేరు ప్రకటించారు. పాలూరి గతంలో బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ గా ఉండగా ఆయన కౌన్సిల్లో కౌన్సిలర్ గా పదవి నిర్వహించారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, మైలవరపు గోపాలకృష్ణ లు ప్రధానంగా ఆశించిన వారిలో ఉన్నారు. ఈ ఆశావహులతో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడి ఏకాభిప్రాయం తీసుకురావడానికి తీవ్రమైన కసరత్తే చేశారు. చివరకు పాలూరి వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. పురపాలక సంఘంలో మొత్తం 48 వార్డులు ఉండగా జనసేన 22, తెలుగుదేశం 22, బిజెపికి నాలుగు చొప్పున కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లు కూడా త్వరితగతిన ఖరారు చేసి ప్రకటిస్తామని చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ కూడా పాల్గొన్నారు.