కూటమి ప్రభుత్వంలోనే పల్లెలు అభివృద్ధి
కోటబొమ్మాళి: కూటమి ప్రభుత్వంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని హరిశ్చంద్రపురం మాజీ ఎంపిటిసి ప్రతినిధి హెచ్. అప్పలరాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా హరిశ్చంద్రపురం పంచాయతీలో అర్హులకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలయిన విద్యా, వైద్యంతో పాటు పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణం జరిగిందని అన్నారు. చిన హరిశ్చంద్రపురం వద్ద వంశధార కాలువపై కోటి 70 లక్షల వ్యయంతో కాలువపై వంతెన బాపన్నపేట, ఉప్పరపేట గ్రామాలకు తారు రోడ్డు సదుపాయం కలిగిందన్నారు. చిన హరిశ్చంద్రపురం గ్రామంలోని ఎంపియుపి పాఠశాల ఆవరణలో సిమెంట్ రోడ్లు నిర్మాణంతో వర్షపు నీటి సమస్య నివారించడం జరిగిందని అన్నారు. ఇంజాంపాడు వద్ద వంతెన నిర్మాణంతో ప్రజలకు ఇబ్బందులు తొలిగాయని అన్నారు. తాగు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా పేదహరిశ్చంద్రపురం, బాపన్నపేట, ఉప్పరపేట గ్రామాలకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందివ్వడం జరిగిందని అన్నారు. అలాగే ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణం అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. ప్రజలంతా గమనించి కూటమి ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆదరించాలని అప్పలరాజు కోరారు.