కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ దేశం నేత నాయుడు విస్తృత ప్రచారం
నరసాపురం, మేజర్ న్యూస్ :రానున్న గోదావరి పుష్కరాల నాటికి నరసాపురాన్ని సమగ్రంగా తీర్చిదిద్దే బాధ్యత కూటమిదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారంపురపాలక సంఘం పరిధిలోని 4,5 వార్డులలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిని కొత్తపల్లి శైలజ జానకీరామ్, 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని భూపతి దుర్గాదేవి, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని తిరుమాని శశిదేవిల విజయానికై విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, నరసాపురం మరింత వేగంగా ప్రగతి సాధించాలంటే స్థానిక పాలకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నరసాపురం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోందని, పుష్కర ఘాట్లు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల్లో కూటమి నాయకత్వానికే అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజాసేవకు నిరంతరం తపించే మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిని కొత్తపల్లి శైలజ జానకీరామ్‌కు గాజు గ్లాస్ గుర్తుపై, 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని భూపతి దుర్గాదేవికి సైకిల్ గుర్తుపై, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని తిరుమాని శశిదేవికి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డుల పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, కొవ్వలి ఫాలోవర్స్, మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.