అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం
ద్వారకా తిరుమల మేజర్ న్యూస్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని నుదుటున కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో శ్రీదేవి, భూదేవిలను, పెండ్లాడారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న వెంకన్న కళ్యాణం గోవింద నామస్మరణలు, వేదమంత్రాలు నడుమ కడు రమణీయంగా సాగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణం నిర్వహించారు. ముందుగా రకరకాల పుష్ప మాలికలతో, పచ్చిపూలతో, బెంగుళూరు పుష్పాలతో, అరటి బోధలతో, మామిడి తోరణాలతో, విద్యుత్ అలంకరణలతో, కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక వాహనంపై శ్రీవారి, అమ్మవార్ల, కళ్యాణమూర్తులను వేయించేపు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, వేదమంత్రాల మధ్య వాహనాన్ని కల్యాణవేదిక వద్దకు తెచ్చారు. అప్పటికే వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కళ్యాణ తంతు ప్రారంభించారు. మొదట శాంతి మంత్రాలతో సర్వదేవతా ప్రార్థనలు చేశారు కళ్యాణ తంతు చివర గట్టంలో భక్తుల గోవింద నామస్మరణలు, భాజా భజంత్రీలు, వేదమంత్రాలు నడుమ శుభ ముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి మాంగల్య ధారణ, తలంబ్రాలు, వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఆయన కుమారుడు నివృత రావు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ వేదిక ఆద్యంతం భక్తులను పరవశింపజేసింది ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ రావు పర్యవేక్షించారు. చట్టపరమైన భద్రత ఏర్పాట్లను బందోబస్తును ఎస్ఐ సుధీర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.