కళ్యాణదుర్గంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఓట్ల లెక్కింపునకు 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు.. డీఎస్పీ దైవప్రసాద్ హెచ్చరిక
కళ్యాణదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్ : ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కళ్యాణదుర్గం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు డీఎస్పీ దైవప్రసాద్ తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన భద్రపరిచే గదుల్లో బ్యాలెట్ పెట్టెలను భద్రంగా ఉంచినట్లు తెలిపారు. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ భద్రతా ఏర్పాట్లలో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 26 మంది ఎస్‌ఐలు, 80 మంది ఏఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు, 70 మంది హోంగార్డులు, 15 మంది మహిళా పోలీసులు, మూడు ప్రత్యేక బృందాలు విధులు నిర్వహించనున్నట్లు వివరించారు.
కౌంటింగ్ కేంద్రాలకు 200 అడుగుల పరిధి వరకు ప్రజల రాకపోకలను నియంత్రించడంతో పాటు ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్లు, నిఘా కెమెరాలు, సంచార పోలీసు బృందాలతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ దైవప్రసాద్ హెచ్చరించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ధర్నాలు, హంగామాలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల లోపల, బయట లేదా ఇతర ప్రాంతాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, గొడవలు, ఘర్షణలకు పాల్పడినా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు, అధికారులకు సహకరించి ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు.
రిపోర్టర్ : సుధా మోహన్ కళ్యాణదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్