భగవంత్ మాన్ లాహోర్ పర్యటనపై పాక్ కీలక ప్రకటన
సూర్య నేషనల్ డెస్క్: లాహోర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక 'వరల్డ్ పంజాబీ కాన్ఫరెన్స్'లో పాల్గొనేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ పర్యటనకు సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ సైతం సానుకూలంగా స్పందించింది. భగవంత్ మాన్ లాహోర్ రావాలని భావిస్తే ఆయనకు వీసా మంజూరు చేసే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని పాక్ అధికారికంగా ప్రకటించింది. అయితే భారత్-పాక్ దౌత్య సంబంధాలు, భద్రతా నిబంధనల దృష్ట్యా ఆయన పర్యటనకు భారత కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.
సంస్కృతి ఒక్కటే.. పర్యటనపై మాన్ ఆసక్తి
నవంబర్ 27న లాహోర్‌లో నిర్వహించనున్న ప్రపంచ పంజాబీ సదస్సుకు హాజరు కావాలంటూ తనకు ఆహ్వానం అందిన విషయాన్ని భగవంత్ మాన్ స్వయంగా వెల్లడించారు. రెండు పంజాబ్‌ల (భారత్, పాకిస్తాన్) భాష, సంస్కృతి ఒక్కటేనని, సరిహద్దులను దాటి సాంస్కృతిక బంధాలు బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే ఈ సదస్సుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, కర్తార్‌పూర్ కారిడార్ తిరిగి తెరిస్తే పంజాబ్ శాసనసభ సభ్యులందరినీ దర్శనం కోసం పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
వీసాపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందన
ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సజ్జాద్ హైదర్ ఖాన్ మాట్లాడుతూ.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటనపై తమ వైఖరిని స్పష్టం చేశారు. మాన్ పాకిస్తాన్‌ను సందర్శించాలనుకుంటే ఆయనకు వీసా జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, ఆయన పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది భారత్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు.
కేంద్రం వైఖరిపైనే నిర్ణయం
రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా మంత్రులు అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా 'పొలిటికల్ క్లియరెన్స్' తీసుకోవాల్సి ఉంటుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత దౌత్య సంబంధాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి పాక్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర హోం, విదేశాంగ శాఖల తుది నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.