కళ్యాణదుర్గం పట్టణంలో అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు. రేపు నిర్వహించే వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ ర్యాలీలకు పోలీస్ అనుమతులు నిరాకరణ.
కళ్యాణదుర్గం: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నవంబర్ 10న వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు తలపెట్టిన ర్యాలీలకు పోలీసు శాఖ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో పోలీస్ యాక్ట్ 1861లోని సెక్షన్ 30, అలాగే 144 సెక్షన్ అమలులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా పరిసర గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పోలీసు శాఖ విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల అనంతర పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల భద్రత, పట్టణంలో సాధారణ జనజీవనం, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, ఇతరులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఘర్షణలకు దారితీసే చర్యలకు పాల్పడటం వంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాలీల్లో పాల్గొనే వారితో పాటు, వాటి నిర్వహణకు బాధ్యత వహించే వ్యక్తులపై కూడా చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను నిర్వహించుకునే విషయంలో చట్టపరమైన నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, పోలీసు శాఖ నుంచి అనుమతి లేని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీ కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వివాదాలకు దారితీసే ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసు శాఖకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ విజ్ఞప్తి చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.