అనపర్తిలో కూటమికి చారిత్రాత్మక విజయం - ప్రజా తీర్పు అభివృద్ధికి నిదర్శనం.. నల్లమిల్లి.
అనపర్తి, మేజర్ న్యూస్.అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయం నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని, అందుకు నిదర్శనమే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు లభించిన అఖండ విజయమని ఆయన పేర్కొన్నారు.సోమవారం అనపర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గ ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ విశ్లేషణ నిజమైందని పేర్కొన్నారు.
సుమారు ఆరు నెలల క్రితం తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం సైతం కూటమి వైపు మొగ్గు చూపుతోందని ముఖ్యమంత్రి ముందుగానే విశ్లేషించారని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను నిజం చేశాయని తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడం ప్రజల ఆదరణకు నిదర్శనమన్నారు. అనపర్తి మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసంశెట్టి నాగేశ్వరరావు 5,624 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, బిక్కవోలు మండలం జడ్పీటీసీ అభ్యర్థి నల్లమిల్లి ఆదిలక్ష్మి 17,064 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారని తెలిపారు. అలాగే రంగంపేట మండలం జడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ల శిరీష 6,233 ఓట్ల మెజార్టీతో, పెదపూడి మండలం జడ్పీటీసీ అభ్యర్థి రావాడ నాగేశ్వరరావు 8,437 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని వివరించారు. ఈ విజయాలు కేవలం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే కాకుండా నియోజకవర్గ ప్రజలు అందించిన ఘనమైన తీర్పు అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరుకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు.ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఎన్నికల ఫలితాలు వారికి తగిన సమాధానమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు తగిన సహకారం అందించకుండా వారిని నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుందని, అలాంటి సమయంలో సహకరించకపోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా కూటమిలోకి రావాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, వాటిని గుర్తించిన ప్రజలు కూటమి అభ్యర్థులకు ఘనవిజయం అందించారని పేర్కొన్నారు. ఈ విజయం కూటమి నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు.ఈ సమావేశంలో అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల జడ్పీటీసీ అభ్యర్థులు, నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.