హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు తంగేళ్లమూడి రాజశేఖర్ (48) కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు సోమవారం అందజేశారు. పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో హోంగార్డులతో పాటు అన్ని కేడర్ల పోలీసు సిబ్బందికి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా గ్రూప్ వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. విజయవాడ నగర హోంగార్డు విభాగంలో హెచ్‌జీ నంబర్ 308తో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ ఈ ఏడాది ఆగస్టులో విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య శ్రీలక్ష్మికి పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో రూ.10,62,000 బీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్‌ఐ సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.