ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయం, నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కారణంగానే ఈ ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మరోసారి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ కూటమి విజయాన్ని అడ్డుకోలేకపోయిందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు లభించిన గుర్తింపే ఈ విజయమని అభివర్ణించారు.కొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి ఎదురైనా ప్రజల తీర్పును హుందాగా స్వీకరించామని ఎంపీ తెలిపారు. ఒక ఎంపీటీసీ స్థానంలో కేవలం నాలుగు ఓట్ల తేడాతో, మరో స్థానంలో ఎనిమిది ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందామని వివరించారు. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజమని, ప్రజల తీర్పును గౌరవించడం తమ బాధ్యతని పేర్కొన్నారు.ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
మరో 20 ఏళ్లు అధికారం మాదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తుంటే రాబోయే మరో 20 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమిదే అధికారం అన్న నమ్మకం కలుగుతోందని ఎంపీ చిన్ని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం గెలిచిందని, అభివృద్ధి గెలిచిందని, ప్రజల విశ్వాసం గెలిచిందని పేర్కొన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ఇదే విజయ పరంపరను కొనసాగించి క్లీన్ స్వీప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ డిప్యూటీ మేయర్ పదవిపై స్పష్టత
విజయవాడ నగర డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ.. విజయవాడ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించామని, డిప్యూటీ మేయర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై కూటమి నాయకత్వం సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.అదేవిధంగా బీజేపీ నాయకుడు అడ్డూరి శ్రీరామ్‌కు కూడా సముచితమైన పదవి కల్పిస్తామని పేర్కొన్నారు. కూటమిలోని మూడు పార్టీల నాయకుల మధ్య సమన్వయం, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతామని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా