ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్
మచిలీపట్నం మేజర్ న్యూస్ : గన్నవరం మండలం బుద్ధవరంలోని కేర్ అండ్ షేర్ డాడీస్ హోమ్‌లో సంరక్షణ పొందుతున్న ఇద్దరు చిన్నారులను సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా ఎంపికైన తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్, కేరళకు చెందిన దంపతులు ఈ చిన్నారులను దత్తత తీసుకున్నారు. 2021లో కేరింగ్స్ పోర్టల్ ద్వారా దత్తత కోసం నమోదు చేసుకున్న దంపతులకు, అక్టోబర్‌లో చిన్నారులను ఎంపిక చేసి కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తికావడంతో కలెక్టర్ తన ఛాంబర్‌లో చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ప్రేమాభిమానాలతో కూడిన కుటుంబ వాతావరణం కల్పించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని దంపతులకు సూచించారు. అనంతరం నవంబర్‌లో నిర్వహించే జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఆవిష్కరించారు. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, అర్హులైన దంపతులు కేరింగ్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. విమల, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ప్రొటెక్షన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.