స్వచ్ఛ సుందర చల్లపల్లి విప్లవాత్మక మార్పునకు నాంది
చల్లపల్లి మేజర్ న్యూస్: స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం విప్లవాత్మక మార్పునకు నాంది పలికిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం చల్లపల్లిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ - డాక్టర్ తరిగోపుల పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం 4,000రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కాసానగర్ వద్ద ఎన్.హెచ్-216 మలుపులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వాగతం బోర్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. చల్లపల్లి ఒకటో వార్డులోని గ్రామపంచాయతీ హిందూ స్మశాన వాటికలో స్వచ్ఛ సుందర చల్లపల్లి, మనకోసం మన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్మశానం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం చల్లపల్లి గ్రామపంచాయతీ పార్కు ఎదుట స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రహదారి వనాన్ని, స్వచ్ఛ సుందర చల్లపల్లి సెల్ఫీ పాయింట్ ప్రదేశాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిస్వార్ధంగా గత 12 సంవత్సరాలుగా డీ.ఆర్.కే దంపతులు చల్లపల్లి గ్రామ అభివృద్ధికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు చేస్తున్న కృషి ఆదర్శనీయం అన్నారు. భారత స్వతంత్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ దేశ ప్రగతి గురించి ఆలోచించి స్వతంత్రానికి పూర్వమే చేపట్టిన నిర్మాణ కార్యక్రమం, స్వచ్ఛతపై ప్రజా చైతన్య కార్యక్రమం తదుపరి కాలంలో ముందుకు సాగని నేపథ్యంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగటం విశేషం అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మరింత మద్దతు సహకారం అందించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామంలో చెట్ల సంరక్షణ ప్రజల సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పొడి చెత్త పూర్తిగా రీ-సైక్లింగుకు వెళ్లాలని కోరారు. నిస్వార్ధ సేవ చేస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి స్ఫూర్తితో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా విడనాడాలని కోరారు. త్రాగునీటి కాలువలో చెత్త వేసే అలవాటు మానుకోవాలన్నారు. . సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ తరిగోపుల పద్మావతి మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం - పరిశుభ్రతకు ప్రముఖ ప్రాముఖ్యతనిస్తూ గత పన్నెండు ఏళ్ల నుంచి నిరంతర తపనతో కృషి చేస్తున్న క్రమంలో గ్రామంలో 32వేల మొక్కలు నాటి పెంచుతున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హిందూ స్మశాన వాటిక, ఘన వ్యర్ధాల నుంచి సంపద ఉత్పత్తి కేంద్రంతో కూడిన తరిగోపుల ప్రాంగణం మొత్తం సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయటం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.