మూడు విడతల్లో ఎన్నికలు..అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. ఎక్కడా జాప్యం ఉండకూడదు: కలెక్టర్ కీర్తి చేకూరి
కడియం ,మేజర్ న్యూస్ :గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి, ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నుంచి తుది ఫలితాల వరకు ఏ దశలోనూ జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని, ఇందులో భాగంగా నవంబర్ 26న తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరుగుతాయన్నారు.
పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 4,082 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.