నూతన జడ్పీటీసీ సభ్యులకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాల అందజేత
విజయవాడ మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు నూతనంగా ఎన్నికైన 15 మంది జడ్పీటీసీ సభ్యులకు రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. సుశీల సోమవారం ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. స్థానిక జెడ్పీ సీఈవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందించి అభినందించారు. విజయవాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బీజేపీ) శనివారమే ధ్రువీకరణ పత్రం స్వీకరించగా, చందర్లపాడు జడ్పీటీసీగా ఎన్నికైన శేఖమూరి అపర్ణ కుటుంబంలో మరణం కారణంగా సోమవారం పత్రం అందుకోలేకపోయారు. ధ్రువీకరణ పత్రాలు స్వీకరించిన సభ్యులు తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, నూతన సభ్యుల వెంట వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.