జేఎన్టీయూలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు.. సాంకేతిక రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం.. ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను జేఎన్టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ఆవరణంలోని నెహ్రూ విగ్రహానికి ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు, ఓఎస్డీ ఆచార్య ఎన్. దేవన్న, రిజిస్ట్రార్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ అందించిన సేవలను స్మరించుకున్నారు. సాంకేతిక రంగం అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని, పరిశోధనాత్మక ఆలోచనలతోనే నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, సమయపాలన, క్రమశిక్షణ, విశిష్ట వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఉండేదని, అందుకే ఆయనను పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి, ఓటీపీఆర్‌ఐ కళాశాలలో డైరెక్టర్ ఆచార్య జి.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, ఆచార్యులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..