రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా
సూర్య అంతర్జాతీయ డెస్క్: రష్యా సైనిక నిఘా సంస్థ రష్యా మద్దతుతో రక్షణ రంగ సంస్థపై జరిగిన విధ్వంస యత్నంపై ఎస్టోనియా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ సాంకేతికతను తయారు చేసే డ్రోన్ తయారీ సంస్థ 'థ్రియోడ్ సిస్టమ్స్' పై రష్యాకు చెందిన జీఆర్ యూ (GRU) నిఘా సంస్థ ఆదేశాలతో జరిగిన విఫలమైన అగ్నిప్రమాద (అర్సన్) దాడి కుట్రను ఎస్టోనియా సెక్యూరిటీ సర్వీసెస్ భగ్నం చేశాయి. ఈ ఘటనలో అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిది మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా ఇటువంటి దుశ్చర్యలతో ఎస్టోనియా భద్రతను అస్థిరపరచాలని చూస్తోందని ఆరోపిస్తూ డిసెంబర్ 1 నుండి రష్యాతో ఉన్న అన్ని సరిహద్దు క్రాసింగ్ పాయింట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సాహ్క్నా అధికారికంగా ప్రకటించారు.
రష్యా పాల్పడుతున్న శత్రుపూరిత చర్యలు, హైబ్రిడ్ ఆపరేషన్లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎస్టోనియా ప్రధాని క్రిస్టెన్ మిచల్ స్పష్టం చేశారు. రష్యా నిఘా వర్గాలు సరిహద్దు మార్గాలను ఉపయోగించుకుని ప్రజలపై, దేశ భద్రతపై ప్రభావం చూపే ప్రయత్నాలను అడ్డుకోవడానికి సరిహద్దుల మూసివేత ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఫిన్లాండ్, లాట్వియా మరియు లిథువేనియా దేశాల అధికారులకు ముందే సమాచారం అందించినట్లు విదేశాంగ మంత్రి తెలిపారు. రక్షణ పరిశ్రమలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి దేశ భద్రతను పటిష్టం చేసేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎస్టోనియా ప్రభుత్వం వెల్లడించింది.