andhrapradesh
జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట న్యూస్: ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేసిన జగన్,ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో లోపాలున్నాయని విమర్శించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.ఎన్నికల ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జగన్ పాలనలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు,ఓటర్లు హింసకు గురయ్యారని,ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.ఎన్నికలపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలను గుర్తించాలని సూచించారు.విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచిన దాఖలాలు జగన్ పాలనలో లేవని విమర్శించారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ,బాధితులకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
మురసు తుఫాను సహాయక చర్యలు 80 శాతం పూర్తి
మురసు తుఫాను కారణంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు.విద్యుత్ సరఫరా,పారిశుధ్యం,తాగునీరు,రోడ్లు,డ్రైనేజీల మరమ్మతులు సహా వివిధ శాఖల పరిధిలో 80 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.రోడ్లపై పేరుకుపోయిన బురద,నేలకూలిన చెట్లు,లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటి కారణంగా కొన్ని చోట్ల పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు.తుఫాను కారణంగా సుమారు 10 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని,అనుమతులు వచ్చిన వెంటనే మరమ్మతులు చేపడతామని తెలిపారు.వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారని చెప్పారు.మిగిలిన పునరుద్ధరణ పనులను శనివారం నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.