జడ్పీ చైర్మన్ రేసులో డాక్టర్ "తూమాటి" - ఆత్మకూరుకు జడ్పీ చైర్మన్ పదవి దక్కేనా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించే వారి జాబితాలో ఆత్మకూరు మండల జడ్పిటిసి మెంబర్ డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులు పొందారని తెలుస్తోంది. ఆత్మకూరు మండల జడ్పిటిసి స్థానం నుండి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, రాజకీయాల్లో అత్యంత చురుగ్గా వ్యవహరించే డాక్టర్ శశిధర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఆయన రెండు దశాబ్దాల కాలంగా రాజకీయాల పట్ల ఆసక్తితో ప్రజలతో మమేకమై అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించినా ఎవరి సహకారం లేకుండానే డాక్టర్ శశిధర్ రెడ్డి బట్టేపాడు ఎంపిటిసి స్థానం నుండి టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆత్మకూరు మండల జడ్పిటిసి స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దాంతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకు జిల్లా నాయకులు హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అయితే అదే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో తన కుమారుడికి ఒక క్యాబినెట్ ర్యాంకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉందని, మళ్లీ అదే ఇంట్లో క్యాబినెట్ ర్యాంకుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం నిశితంగా ఆలోచిస్తుందని పలువురు భావిస్తున్నారు. డాక్టర్ శశిధర్ రెడ్డి జడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్న విషయం రాష్ట్ర అధిష్టానం దృష్టికి వెళ్ళిందని కూడా తెలుస్తోంది. ఆయన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆశీస్సులు పొందారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆత్మకూరు మండలం కు ప్రధాన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యత నిచ్చే క్రమంలో అధిష్టానం పరిశీలించి యువకుడు విద్యావంతుడైన డాక్టర్ శశిధర్ రెడ్డికి అవకాశం ఇచ్చేలా పరిశీలించాలని ఆయన కోరుతున్నారు. జిల్లా తెలుగుదేశం నాయకుల ఆశీస్సులు కూడా పొందే ప్రయత్నంలో డాక్టర్ శశిధర్ రెడ్డి ఉన్నారన్న సమాచారం ప్రచారం గా ఉంది. అత్యంత చురుకైన నాయకుడిగా నిత్యం ప్రజలతో మమేకమయ్యే నేతగా కొనసాగుతున్న డాక్టర్ శశిధర్ రెడ్డి గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేశారు. ఐదేళ్లపాటు పాటు ఎంపీటీసీ మెంబర్గా కొనసాగారు. ప్రస్తుతం ఆత్మకూరు మండల జడ్పిటిసి మెంబర్ గా ఘనవిజయం సాధించారు. ఆయన ఆకాంక్షను మరి పార్టీ అధిష్టానం పరిశీలించి అవకాశం కల్పిస్తుంది ఏమో వేచి చూడాల్సి ఉంది.