జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన ఎం.ఎన్.ఆర్ విద్యార్థి కొవ్వూరి పూర్ణ యశ్వంత్ రెడ్డి
అనపర్తి మేజర్ న్యూస్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 క్రికెట్ పోటీల్లో అనపర్తి ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి కొవ్వూరి పూర్ణ యశ్వంత్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. చిత్తూరు జిల్లా నగరిలో తూర్పుగోదావరి, చిత్తూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో తన ప్రతిభను చాటుకున్న పూర్ణ యశ్వంత్ రెడ్డి, నవంబర్ నెలలో మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ తాడి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, క్రీడల్లో విద్యార్థులు సాధిస్తున్న విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఎం.ఎన్.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మల్లిడి అనంత సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని తెలిపారు.
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ, పూర్ణ యశ్వంత్ రెడ్డి జాతీయ స్థాయిలోనూ రాణించి కళాశాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సత్యభామ స్కూల్ డైరెక్టర్ మల్లిడి మాధవీలత, శ్రీ సాయి మాధవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ టి. రామభద్రారెడ్డి, ఎన్. నవీన్, ఢిల్లీ పబ్లిక్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ సుదీష్న జానా, సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ తనుశ్రీ దెబ్రోయ్, పీఈటీ కిరణ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థిని అభినందించారు.