శభాష్ జీవీఎంసీ! అక్రమ ‘యమలోకం’ పీటలు కదిలించిన అధికారులు
సూర్య ఎఫెక్ట్....
కకావికలమైన కలెక్షన్ల పన్నాగం!
పోలీస్ బందోబస్తుతో తరలివెళ్లి క్రేన్లతో అక్రమ సెట్లను సమూలంగా కూల్చేసిన జోన్ -6 అధికారులు
విధుల్లో ఉన్న అధికారులపై మహిళా నిర్వాహకురాలి వీరంగం.. బరితెగించి విచ్చలవిడి వాగ్వాదం!
కూల్చివేతల్లో రట్టయిన ‘రూ.100’ టికెట్ల దందా.. కేఎన్‌ఆర్ అండ్ కో, గణేష్ దోపిడీకి పడ్డ చెక్!
దైవ కార్యక్రమాలకు ఆటంకం లేకుండానే తొలగింపులు చేపట్టామన్న గాజువాక సీఐ చింతా వాసునాయుడు
గాజువాక, సెప్టెంబర్ 21, మేజర్ న్యూస్ : గాజువాకలో పండుగ పవిత్రతను అడ్డం పెట్టుకుని కేఎన్‌ఆర్ అండ్ కో, గణేష్ ముఠా సాగించిన అనధికార రాక్షస వసూళ్ల సామ్రాజ్యానికి ఎట్టకేలకు గండిపడింది. కనీస అనుమతులు లేకుండా అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న తీరును ఎండగడుతూ ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితమైన ‘గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ ‘జోన్-6’కి కమీషన్ల కక్కుర్తి!’ పరిశోధనాత్మక కథనం జీవీఎంసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి సాగిస్తున్న ఈ రాక్షస వసూళ్ల వ్యవహారాన్ని మేజర్ న్యూస్ ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో జోన్-6 జీవీఎంసీ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించారు. సోమవారం ఉదయం స్థానిక పోలీస్ యంత్రాంగం నుంచి పక్కా బందోబస్తును సమకూర్చుకుని నేరుగా ఘటనా స్థలానికి తరలివెళ్లారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమార్చి నడుపుతున్న భారీ ‘యమలోకం’, 'డైనోసార్' సెట్లను క్రేన్ల సాయంతో సమూలంగా నేలమట్టం చేసి అక్రమార్కుల ఆటకట్టించారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అధికారులు చూపిన ఈ సత్వర స్పందన, సాహసోపేతమైన చర్యపై స్థానికులు "శభాష్ జీవీఎంసీ" అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
క్రేన్ల ధాటికి వణికిన ‘యమలోకం’.. మహిళా నిర్వాహకురాలి బరితెగింపు, విచ్చలవిడి వీరంగం!
నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న దందాకు గండి కొడుతూ జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగడంతో.. అది చూసి జీర్ణించుకోలేకపోయిన నిర్వాహక వర్గానికి చెందిన ఓ మహిళ ఘటనా స్థలంలోనే నానా రభస సృష్టించింది. ప్రభుత్వ విధుల్లో ఉన్న సిబ్బందిపైకే నేరుగా దూసుకొస్తూ, అడ్డగోలు వాదనలతో నోరుపారేసుకుంది. తాము చేసిన చట్టవిరుద్ధ పనులను సమర్థించుకుంటూ, వారి చట్టబద్ధ చర్యలను అడ్డుకునేందుకు నానా హంగామా చేసింది. సాక్షాత్తూ ‘యమధర్మరాజు’ సెట్‌ను నడిపించిన నిర్వాహకురాలే చట్టం కొరడా ధాటికి బెంబేలెత్తి బహిరంగంగా చిందులు తొక్కడం అక్కడున్న వారికి విచిత్రంగా కనిపించింది. అయితే ఆమె బెదిరింపులకు, డ్రామాలకు ఏమాత్రం తలొగ్గని మున్సిపల్ యంత్రాంగం.. పోలీస్ బందోబస్తు సమక్షంలో క్రేన్ల సాయంతో యమలోకానికి సంబంధించిన భారీ కటౌట్లు, రాక్షస ప్రతిమలను సమూలంగా పెకలించి, వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించింది.
రట్టయిన ‘రూ. 100’ టికెట్ల దందా.. కేఎన్‌ఆర్ అండ్ కో, గణేష్ దోపిడీకి పడ్డ చెక్!
క్రేన్లతో సెట్లను తొలగిస్తున్న క్రమంలో తెరవెనుక కర్ణంరెడ్డి నర్సింగరావు 'కేఎన్‌ఆర్ అండ్ కో, గణేష్ ముఠా' గుట్టుచప్పుడు కాకుండా సాగించిన భారీ టికెట్ దందా బండారం బట్టబయలైంది. ‘ఎస్ఎల్ఎన్ అమ్యూజ్‌మెంట్ ఈవెంట్స్’ పేరిట ఒక్కొక్కరి నుంచి నిలువు దోపిడీ చేస్తూ విక్రయించిన ‘రూ. 100’ ప్రవేశ టికెట్ల కట్టలు ఆ ప్రాంగణంలో కుప్పలుతెప్పలుగా పడి అధికారుల కంటపడ్డాయి. అగ్నిమాపక భద్రత లేదు.. జీవీఎంసీ అనుమతులు లేవు.. కనీస రక్షణ ప్రమాణాలు అసలే లేవు.. అయినా ‘రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్’ అంటూ భక్తుల భద్రతతో చెలగాటమాడుతూ రోజుకు లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఈ ముఠా అక్రమ సంపాదనకు క్రేన్ల దెబ్బతో తెరపడింది. వీకెండ్ రద్దీని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ రాక్షస కమర్షియల్ దందాకు అధికార యంత్రాంగం వేసిన దెబ్బతో పూర్తిగా ముగింపు పలికినట్లయింది.
దైవ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండానే తొలగింపు: గాజువాక సీఐ చింతా వాసునాయుడు
అక్రమ ‘యమలోకం’ సెట్ల కూల్చివేత అనంతరం గాజువాక సీఐ చింతా వాసునాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. “గాజువాకలో వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అనధికార నిర్మాణాలు, కమర్షియల్ స్టాళ్లను తొలగించేందుకు పోలీస్ రక్షణ కల్పించాలని జీవీఎంసీ అధికారులు నిన్న లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మేము తగిన పోలీస్ బందోబస్తు కల్పించాము. గణపతి విగ్రహానికి, భక్తుల దైవ పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా.. కేవలం అనధికార కమర్షియల్ నిర్మాణాలను మాత్రమే తొలగించి, భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకే జీవీఎంసీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు” అని సీఐ స్పష్టం చేశారు.
అధికారుల చర్యలపై సర్వత్రా హర్షం.. అక్రమార్కులపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ ‘సూర్య’ నేటి దినపత్రికలో వచ్చిన వరుస పరిశోధనాత్మక కథనాలకు స్పందించి, నిర్వాహకుల బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గకుండా క్రేన్లతో అక్రమ సెట్లను నేలమట్టం చేసిన జీవీఎంసీ, పోలీస్ యంత్రాంగం చొరవపై స్థానికుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికారుల చర్యలతో తెరవెనుక రాక్షస దందాను నడిపించిన 'కేఎన్‌ఆర్ అండ్ కో, గణేష్ ముఠా' ఆటలకు తాత్కాలికంగా తెరపడింది. అయితే కేవలం సెట్లను తొలగించడంతోనే సరిపెట్టకుండా, భక్తులను నిలువునా దోచుకున్న ఈ ముఠాపై పోలీసులు తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అక్రమార్కులకు సరైన గుణపాఠం జరిగి, భవిష్యత్తులో దేవుడి పేరుతో సాగే ఇలాంటి రాక్షస దోపిడీ ముఠాల ఆగడాలకు శాశ్వతంగా చరమగీతం పాడినట్లవుతుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.