గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పరిశీలన 56 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడి – నిర్వహణ లోపాలపై ఆరా
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
గుమ్మగట్ట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై అనంతపురం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ హాస్టల్‌ను సందర్శించి పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్‌లో సుమారు 56 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురైనట్లు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం స్థానిక వైద్యులు విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు,అనంతరం హాస్టల్ పరిసరాలతో పాటు వంటగది, స్టోర్ రూమ్, డార్మిటరీలను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతలో కొంత లోపం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు,జిల్లాలోని పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వార్డెన్లు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. గుమ్మగట్ట కేజీబీవీలో జరిగిన ఘటనపై సమగ్ర నివేదికను రాష్ట్ర న్యాయ సేవా సంస్థకు పంపిస్తామని వెల్లడించారు,ఇద్దరు విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించాల్సి ఉందని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు.
సూర్య ప్రతినిధి :పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్