గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే భారీ ప్రోత్సాహకాలు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:గ్రామాల్లో సామరస్యం, ఐక్యత, పరస్పర సహకార భావనను పెంపొందించి, ఎన్నికల సమయంలో తలెత్తే వర్గ విభేదాలు, వివాదాలను తగ్గించడంతో పాటు ఏకాభిప్రాయంతో కూడిన స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందించే ఏకగ్రీవ ఎన్నికల ప్రోత్సాహక నగదును గణనీయంగా పెంచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం తెలిపారు. 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన పెంచిన ప్రోత్సాహక మొత్తాలను అందించాలని ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.1111 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు.
పెంచిన ప్రోత్సాహక నగదు వివరాలు:
*1)5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు.*
*2)5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు.*
*3)10,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు.*
*గతంలో 2,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, 2,001 నుంచి 5,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10,000కు పైగా జనాభా కలిగిన పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించేవారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచుతూ నూతన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.*
*ప్రోత్సాహకానికి వర్తించే నిబంధనలు:*
*సర్పంచ్ పదవితో పాటు గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు సంబంధిత చట్టాలు, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నగదు విడుదలకు ముందు సంబంధిత అధికారులు ఆయా గ్రామ పంచాయతీల అర్హతను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు.*
*ప్రభుత్వం మంజూరు చేసే ప్రోత్సాహక మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీల పరిధిలో ఆమోదించిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి నిర్దేశించిన ఆర్థిక, లెక్కల నిర్వహణ, ఆడిట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.*
*ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పదవీకాలంలో ఈ మొత్తాన్ని దశలవారీగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే చట్టబద్ధమైన హక్కు ఉంటుందని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా వినియోగించుకునే హక్కుకు ఈ పథకం ఎలాంటి భంగం కలిగించదని స్పష్టం చేశారు.*
*గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి*
*ఏకగ్రీవ ఎన్నికల ద్వారా లభించే ప్రోత్సాహకాలపై గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలను జనాభా వర్గాల వారీగా సేకరించి, అవసరమైన ఆర్థిక నిధుల అంచనాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు సమర్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ ప్రోత్సాహక పథకం 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*