గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని 35 మండలాల పరిధిలో ఉన్న 700 గ్రామ పంచాయతీలు, 6,668 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. మొదటి విడతలో కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో 134 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కావలి డివిజన్‌లోని కొన్ని మండలాలు కలిపి మొత్తం 14 మండలాల పరిధిలో 297 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మొదటి విడతకు నవంబర్ 15న, రెండో విడతకు నవంబర్ 16న, మూడో విడతకు నవంబర్ 19న ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. ఆయా తేదీల నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు మొదటి విడతలో నవంబర్ 17వ తేదీ, రెండో విడతలో నవంబర్ 20వ తేదీ, మూడో విడతలో నవంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మొదటి విడతకు నవంబర్ 18న, రెండో విడతకు నవంబర్ 21న, మూడో విడతకు నవంబర్ 24న నిర్వహించనున్నారు. నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు దాఖలు చేసేందుకు మొదటి విడతలో నవంబర్ 19వ తేదీ, రెండో విడతలో నవంబర్ 22వ తేదీ, మూడో విడతలో నవంబర్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అప్పీళ్ల పరిష్కారం అనంతరం అభ్యర్థుల ఉపసంహరణకు మొదటి విడతలో నవంబర్ 21వ తేదీ, రెండో విడతలో నవంబర్ 24వ తేదీ, మూడో విడతలో నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు.