ఘనంగా దసరా
గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
విజయవాడ దుర్గగుడిలో అక్టోబర్ 10 నుంచి 20 వరకు జరిగే దసరా మహోత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ ఉచిత దర్శనాలు, ప్రసాదాల పంపిణీ, తాగునీరు, వైద్య, పారిశుధ్య, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. భక్తుల భద్రత కోసం ఏఐ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ తెరలు, ప్రత్యేక మొబైల్ అనువర్తనాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. 22 పార్కింగ్ ప్రాంతాలు, మూడు హోల్డింగ్ ప్రాంతాలతో పాటు 24 గంటలూ పనిచేసే కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 20 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. భక్తుల భద్రతకు క్యూఆర్ కోడ్ ఆధారిత చిన్నారుల గుర్తింపు వ్యవస్థను అమలు చేయనున్నట్లు సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు.