ఎస్.రాయవరంలో సజావుగా సాగిన పరిషత్ ఎన్నికల సామగ్రి పంపిణీ!
గందరగోళం వద్దని అనకాపల్లి కలెక్టర్ ఆదేశాలు
ఎస్.రాయవరం, నవంబర్ 4, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఎస్.రాయవరం మండలంలో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయింది. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన మెటీరియల్ తీసుకొని వారి వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మండలంలో జడ్పీటీసీ ఎన్నికతో పాటు 21 ఎంపీటీసీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయని రిటర్నింగ్ అధికారిణి మనోరమ తెలిపారు.
ఇదిలా ఉండగా, పరిషత్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చూడాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రద్దీ నియంత్రణకు మరిన్ని కౌంటర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, రూట్ వాహనాల రవాణా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎన్నికల ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా ముగిసేలా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.