ఎన్నికలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు – కాకాణి
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వెంకటగిరిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసానికి చేరుకున్న కాకాణి, ఎంపీ గురుమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు.నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులకు దిగినా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి విధేయంగా నిలవడం అభినందనీయమన్నారు. సైదాపురం జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడంతో పాటు రెండు మండలాల్లో సమాన స్థానాలు సాధించిందని తెలిపారు.ఎంపీపీ ఎన్నికల్లో టాస్ ప్రక్రియలో పారదర్శకత లేదని, తమ అభ్యర్థులకు 514 ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ చివరకు టీడీపీకి 56 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించడం అన్యాయమని ఆరోపించారు. ఎంపీ గురుమూర్తిని సమావేశానికి అనుమతించకుండా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు పోరాడారని, ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా పార్టీని వీడకుండా నిలిచిన నలుగురు ఎంపీటీసీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల్లో వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.