ఎన్నికల విధులకు 300 మంది సిబ్బంది
మెలియాపుట్టి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మెలియాపుట్టి మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్. నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేశారు. మండలవ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణకు 300 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మండలాన్ని తొమ్మిది రూట్లు, నాలుగు జోన్లుగా విభజించినట్లు వివరించారు. మండలంలో మొత్తం 47,065 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, ఎన్నికల సామగ్రి చేరవేతకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో. పి నరసింహ ప్రసాద్, తాసిల్దార్ రాము ,అధికారులు ఉన్నారు.