ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట : ఈ నెల 26న జరగనున్న నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పెట్లూరివారిపాలెంలో ఉన్న ఏఎం రెడ్డి కళాశాలలో ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను సోమవారం ఆమె అధికారు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పంపిణీ స్వీకరణ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం వీడియో చిత్రీకరణ చేపట్టాలని సూచించారు. స్ట్రాంగ్‌రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే సమయంలో ప్రతి బాక్సుకు ప్రత్యేక నంబరుతో మార్కింగ్ చేయాలని ఆదేశించారు. ఓట్ల సంఖ్యకు అనుగు ణంగా కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వీడియో చిత్రీకరణ చేపట్టాలని ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.