ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ నగరాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నగర సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో విజయవాడ ఎదుర్కొన్న ట్రాఫిక్ సమస్యలు, వరద ముంపు, రవాణా ఇబ్బందులు, మౌలిక సదుపాయాల కొరతను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫీచర్ వాల్ నిర్మాణానికి రూ.200 కోట్లు, బౌండరీ వాల్ నిర్మాణానికి రూ.28 కోట్లు, ప్రధాన నీటి పారుదల పనులకు రూ.500 కోట్లు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి రూ.60 కోట్లు, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.105 కోట్లు కేటాయించినట్లు వివరించారు. నగర పరిధిలో సుమారు 4 వేల అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లతో ప్రణాళిక రూపొందించగా, ప్రాంతీయ రక్షణ చర్యలకు తక్షణమే రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బౌండరీ వాల్ నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధితో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సబర్బన్ రైలు సదుపాయాలు, రైల్వే క్రాసింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. గన్నవరం, బైపాస్ మార్గాల ద్వారా భారీ వాహనాలు నగరంలోకి రాకుండా చర్యలు చేపడుతున్నామని, అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రహదారి, విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ధి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. గన్నవరంలో హెచ్‌సీఎల్ సంస్థ ఏర్పాటుతో సుమారు 5 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా మరిన్ని పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, వి.ఆర్. సిద్ధార్థ ఫ్లైఓవర్ నిర్మాణం, కాలువల సుందరీకరణ పనులు నగరాభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. కృష్ణానది వరదలతో లోతట్టు ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వరద నివారణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కృష్ణా రిటైనింగ్ వాల్, ఇతర రక్షణ పనులతో ప్రజలకు వరద ముప్పు నుంచి భద్రత కల్పించడమే లక్ష్యమన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వరద నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొండ ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లోని సుమారు లక్ష మందికి ధ్రువీకరణ పత్రాలు అందించడం, సింగ్‌నగర్ ప్రాంతంలో 25 వేల మందికి వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడను మెరుగైన రవాణా వ్యవస్థ, ఆధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, పటిష్టమైన వరద నివారణ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో విజయవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.