*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
విజయనగరం, సూర్య : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, నవంబర్ 3వ తేదీన పోలింగ్, నవంబర్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస మండలాలకు సంబంధించి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం (రిసెప్షన్ సెంటర్), స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్.కోటలోని డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం పాఠశాలను సందర్శించి, ఎన్నికల సామగ్రి స్వీకరణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి తరలింపు, భద్రపరిచే విధానం, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనువుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుధాసాగర్, ఎస్.కోట తహసీల్దార్ డి. శ్రీనివాసరావు, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.