andhrapradesh
ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా
పామూరు, మేజర్ న్యూస్ :
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీలో అఖండ మెజారిటీ సాధించి విజయాన్ని కానుకగా అందిస్తానని టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మానం రాజేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి నాయకత్వంలో తాను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచానని తెలిపారు. పంచాయతీ పరిధిలోని తూర్పు కోడిగుడ్లపాడు, జంగాలపల్లి, పోతవరం గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనను ఆదరించి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తన విజయాన్ని అంకితం చేస్తానని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి పంచాయతీ ప్రజల తరఫున అఖండ మెజారిటీని కానుకగా అందిస్తానని పేర్కొన్నారు. తన భర్త మానం మల్లికార్జున సహకారంతో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఒక్క అవకాశం కల్పించాలని కత్తెర గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని రాజేశ్వరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, మానం మల్లికార్జున పాల్గొన్నారు.