డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్
అనంతపురం బ్యూరో
డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు: మంత్రి సత్యకుమార్
: ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, వైద్య పరీక్షల నుంచి చికిత్స వరకు సేవలను అనుసంధానం చేసే ‘సంజీవని’ కార్యక్రమాన్ని డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్‌గా, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 933 ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి, గత వైద్య చరిత్ర, పరీక్షల ఫలితాలు, మందుల వివరాలను డిజిటల్‌గా భద్రపరుస్తామని చెప్పారు.
ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, 48 గంటల్లో ఫలితాలను వాట్సాప్ ద్వారా అందిస్తామని మంత్రి తెలిపారు. ఆరోగ్య సమస్యలు గుర్తించిన వారికి తదుపరి వైద్యం అందేలా ఆసుపత్రులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో సమన్వయం చేస్తామని వివరించారు.
వ్యాధులు ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే గుర్తించి వైద్యం అందించడమే ‘సంజీవని’ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.